1971 సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాందీకి వ్యతిరేకంగా రాజ్‌నారాయణ్ జనతా పార్టీ తరపున ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గంలో పోటీ చేశాడు. ఇందిరా గాంధీ మంచి మెజార్టీతో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కూడా అత్యదిక ఎంపీ స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీ విజయంపై కేసు వేసాడు. ఎన్నికల్లో ఆమె అక్రమాలకు పాల్పడిందని, లంచాలు ఇచ్చిందని, అధికార యంత్రంగాన్ని తన ఎన్నికల అవసరాల కోసం వాడుకుందని, ప్రభుత్వ జీతం తీసుకుంటున్న వారు కూడా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నారని ఆరోపించారు. ఆలహాబాద్ హైకోర్ట్‌లో కేసు విచారించిన జస్టిస్ జగ్‌మోహన్‌లాల్ సిన్హా లంచాలు ఇచ్చారన్న వాదనను తిరస్కరించారు.
కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారనే కారణంపై ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు నిచ్చారు. ఆమెను ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గనకూడదని తీర్పు నిచ్చారు. ఇది తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అంటూ ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఆ తర్వాత ఈ కేసును సుప్రీంకోర్ట్‌లో సవాల్ చేసింది. 1976 నవంబర్ 7వ తేదీన ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్ట్ ఇందిరాగాంధీని నిర్ధోషిగా ప్రకటించింది. ఇందిరాగాంధీ తరపున నానాభారు పాల్కీవాలా వాదించగా, రాజ్ నారాయణ్ తరపున శాంతి భూషణ్ వాదించారు. అయితే ఎమర్జెన్సీ విధించినందుకు నిరసనగా పాల్కీవాలా ఇందిరా గాంధీ వకల్తా నుండి తప్పుకున్నారు. ఎమర్జెన్సీ విధింపు ఇందిరాగాంధీ ప్రతిష్టకు చాలా నష్టాన్ని తెచ్చింది. 1977 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ కేసు ద్వారా రాజ్ నారయణ్ నేషనల్ హీరో అయ్యాడు.