గ్రూప్-1 ప్రధాన పరీక్షల అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 8 పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన ఎపి హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ తరుఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘గ్రూప్-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదు. డిజిటల్ వాల్యూషన్ గురించి చివరి దశలో తెలిపారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఇంగ్లీషు మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్ చేశారు. దీంతో ఇంగ్లీషు మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ప్రయివేట్ వ్యక్తులతో ఎలా వాల్యూషన్ చేయిస్తుంది?.
ఎపిపిఎస్‌సి చైర్మన్‌తో సంబంధం లేకుండా కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారు. ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి’ ‘ అంటూ న్యాయస్థానాన్ని కోరారు. కాగా, నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరుఫు న్యాయవాది పేర్కొన్నారు. వాల్యూషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది. ఇదిలా ఉండగా, త్వరలోనే గ్రూప్-1కు సంబంధించిన ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో సర్వత్రా ఆసక్తి నెలకొంది