ఎవరైనా ఒక వ్యక్తి తనకు చెందిన, తన స్వఆర్జితమైన ఆస్తిని ఒక్కరికిగానీ, కొందరికీ గానీ రాసి ఇచ్చే పత్రాన్నే వీలునామా అంటారు. ఈ వీలునామా ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఆ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన వెనువెంటనే ఇది అమల్లోకి వస్తుంది. ఆయన బతికిఉండగా వీలునామాలో ఆస్తులు రాశారు కాబట్టి హక్కు పొందుతాం అంటే కుదరదు. వీలునామా ఎవరైతే రాస్తారో వారే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలునామా రాసేప్పుడు అది రాసే దస్తూరితోపాటు ఈ వీలునామాకు కనీసం ఇద్దరు సాక్ష్యులు ఉండాలి. ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఈ సాక్ష్యులు, దస్తూరి రాసిన వారు వీలునామా రాసే వ్యక్తికి బాగా తెలిసినవాళ్లయి ఉండాలి. ఒక వేళ భవిష్యత్‌లో సమస్యలు తలెత్తితే కోర్టులో వీరు సరైన సాక్ష్యం చెప్పాలి. అందుకే దస్తూరితోపాటు ఇద్దరు సాక్ష్యులు వీలునామాకు చాలా ముఖ్యం. వీలునామాను వంద రూపాయాల స్టాంపు పేపర్ మీద రాయించి రిజిష్ట్రర్ చేయిస్తే మంచిది.