ఐ.సి. గోలక్‌నాథ్ అండ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. గోలక్‌నాథ్, అతని తమ్ముడికి 500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంజాబ్ అగ్రికల్చర్ సెక్యూరిటీ అండ్ ల్యాండ్ టెన్యూర్ యాక్ట్ ప్రకారం అన్నదమ్ములిద్దరూ చెరి ముప్పయి ఎకరాలు ఉంచుకోవచ్చని, కొన్ని ఎకరాలు కౌలు దారులకు వెళ్తుందని, మిగిలినదంతా మిగులు భూమిగా ప్రభుత్వానికి అప్పజెప్పాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని గోలక్‌నాథ్ కోర్టులో సవాల్ చేశారు.
భూమిని సేకరించడానికి, కలిగిఉండడానికి, ఎటువంటి వృత్తినైనా కొనసాగించడానికి తనకున్న రాజ్యాంగపరమైన హక్కులను పంజాబ్ ప్రభుత్వం కాలరాస్తోందంటూ ఆయన వాదించారు. అయితే పంజాబ్ హైకోర్ట్ చట్టసభలకు వ్యక్తుల హక్కులను సవరించే అధికారం కూడా ఉంటుందని పేర్కొంది. గోలక్ నాథ్ సుప్రీంకోర్ట్‌కు వెళ్లగా తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. రాజ్యాంగం రక్షణ కల్పించిన పౌరుల ప్రాధమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు కూడా లేదని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 13(2) ప్రకారం ప్రాధమిక హక్కులను సవరించడం గాని, వాటి ధిక్కరించే హక్కు గానీ పార్లమెంట్‌కు లేదని 11 మంది జడ్జీల బెంచ్‌లో ఆరుగురు జడ్జీలు మెజార్టీ తీర్పును ఇచ్చారు.