ప్రభుత్వ విధానాలపై ఎవరైనా అసమ్మతి వ్యక్తం చేస్తే.. బెదిరించడంతో పాటు వారి గళాన్ని నొక్కేందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిరోధక చట్టం(యుఎపిఎ), దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్, పలు బిజెపి పాలిత రాష్ట్రాలకు ఢిల్లీ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. గతేడాది ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింస్మాతక ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన విద్యార్థి నేతలు ఆసిఫ్ ఇక్బాల్, తన్హా, నటాషా నర్వాల్, దేవాంగణ కలితలకు న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. విద్యార్థులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఎ) కింద మోపిన అభియోగాలను పోలీసులు నిరూపించలేకపోయారని పేర్కొంది. వీరికి ట్రయల్ కోర్టు బెయిల్‌ను నిరాకరిస్తూ ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టింది. జస్టిస్ సిద్ధార్ధ్, మఅదుల్, అనుప్ జైరాం భంభానీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రభుత్వ విధానాలపై నిరసనలు తెలపడం అంటే ఉగ్రవాద చర్యల కిందకు రావని, అది ఈ దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఐపిసిలోని పలు సెక్షన్ల కింద వచ్చే చర్యలకు ‘ఉగ్రవాద కార్యకలాపాలు’ అనే పేరును వినియోగించడం ఆమోదనీయం కాదని పేర్కొంది.
పోలీసులు పేర్కొన్న యుఎపిఎ చట్టంలోని సెక్షన్ 15(ఉగ్రవాద కార్యకలాపాలు), సెక్షన్ 17(ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరించడం), సెక్షన్ 18(ఉగ్ర కుట్ర) ప్రకారం విద్యార్థులు నేరాలకు పాల్పడ్డారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా నిందితులు ప్రజలను సమీకరించారని, రహదారులను దిగ్భందించారని తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) వ్యతిరేకంగా ముగ్గురు విద్యార్థులు 2019, డిసెంబర్ నుంచి నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు, గతేడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు దారితీసిన కుట్రలో భాగం ఉందన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కరోనా రెండు దశల విజృంభణలో కూడా విద్యార్థులు ఏడాది పాటు తీహార్ జైల్లో ఉంచారు.
యుఎపిఎ కింద కేసులు నమోదు చేసినందున, మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. నటాషా నర్వాల్ తండ్రి మహావీర్ పర్వాల్ కరోనా బారినపడి మరణించగా చివరి కర్మలు చేయడానికి ఆమెకు గత నెలలో మూడు వారాలపాటు మధ్యంతర బెయిల్ లభించింది. ఇక్బాల్ డిగ్రీ పూర్తిచేయడం అత్యవసరమని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు అతనికి ఈ నెల మొదట్లోనే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరలా అతనిని జూన్ 26 సాయంత్రం జైలుకి తీసుకురావాలని ఆదేశించింది. దేవాంగన కలిత, నటాషా నర్వాల్ ఇద్దరూ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో పిహెచ్‌డి స్కాలర్లు కాగా, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా జామియా యూనివర్సిటీలో బిఎ మూడో సంవత్సరం విద్యార్థి. కాగా, వీరికి బెయిల్ మంజూరవ్వడంపై సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్‌భూషణ్ హర్షం వ్యక్తం చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో దాదాపు యాభై మందికిపైగా.. మరణించారు. 200 మంది గాయపడ్డారు.